RS Praveen Kumar: అలాగైతే రేవంత్ రెడ్డి కూడా ఏ11 అవుతారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఏ11గా పేర్కొన్నారన్న బీఆర్ఎస్ నేత
- మెదక్ ప్రమాద ఘటనలోనూ రేవంత్ రెడ్డి ఏ11 అవుతాడని వ్యాఖ్య
- రెండు కేసులకు పోలిక ఉందని వివరించిన ఆర్ఎస్పీ
- ఇక్కడ ఎవరికీ చంపాలనే ఉద్దేశం లేదని వెల్లడి
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ఏ11 నిందితుడైనప్పుడు, మెదక్ జిల్లాలోని ఫ్లెక్సీ ప్రమాదం ఘటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఏ11 నిందితుడే అవుతారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ రెండు ఘటనల్లో వేర్వేరు న్యాయాలు ఉండరాదన్నారు. పైగా ఈ ఘటనల్లో ఉన్న వారు ప్రముఖులేనని... ఒకరు సినిమా స్టార్ అల్లు అర్జున్... ఏఏ అయితే, మరొకరు రేవంత్ రెడ్డి... ఆర్ఆర్ అన్నారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కడుతుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో రేవంత్ రెడ్డి ఏ11గా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రెండు కేసుల్లోని పోలికలను ఆయన తెలిపారు.
రెండు కేసులకు పోలిక తెచ్చిన ఆర్ఎస్పీ
సంధ్య థియేటర్, మెదక్‌లో ఒక రోడ్డు... ఈ రెండు కూడా ప్రజల కోసం ఉద్దేశించినవే అన్నారు. సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమా చూడాలని రేవతి కుటుంబం ప్రీమియర్ షోకు వచ్చారని, ఈ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. మెదక్‌లో రేవంత్ వస్తున్నారని బహిరంగ ప్రదేశంలో ఇద్దరు యువకులు ఫ్లెక్సీ కడుతున్నారని, అక్కడ పర్మిషన్ కూడా లేదన్నారు. కానీ వారు విద్యుత్ షాక్ వల్ల ప్రమాదవశాత్తూ చనిపోయారని తెలిపారు.
చంపాలనే ఉద్దేశం ఉండి ఉండదు...
ఈ రెండు సంఘటనల్లో కథానాయకులకు వ్యక్తులను చంపాలనే ఉద్దేశం ఉండి ఉండదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సెక్షన్ 105 బీఎన్ఎస్ అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిన మరణం కానీ, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదన్నారు. కానీ సంధ్య ఘటనలో ఏఏ (అల్లు అర్జున్)ను ఏ11గా పెట్టినట్లుగా తెలుస్తోందని, కానీ ఇది స్థానిక పోలీస్ వైఫల్యమే అన్నారు. కానీ పోలీసులు తమను తాము నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చుకుంటారా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇదే ప్రకారం మెదక్ ఘటనలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, చివరకు రేవంత్ రెడ్డి కూడా నిందితులు అవుతారన్నారు. వారి పాత్ర ఎంత అనేది విచారణ జరిగితే తెలుస్తుందన్నారు.