Pawan Kalyan: ఎంపీడీవోపై దాడి.... రేపు కడప వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- గాలివీడు ఎంపీడీవోపై వైసీపీ నేత దాడి
- తీవ్రంగా గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న జవహర్ బాబు
- ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న పవన్ కల్యాణ్
- దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
అన్నమయ్య జిల్లాలో ఓ వైసీపీ నేత దాష్టీకానికి గురైన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు (శనివారం) కడప వెళ్లి రిమ్స్ లో జవహర్ బాబును పరామర్శించనున్నారు.
గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఇవాళ మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వాలని ఎంపీడీవో జవహర్ బాబును అడిగాడు. ఎంపీపీ వస్తేనే తాళాలు ఇస్తామని జవహర్ బాబు చెప్పడంతో, ఆగ్రహావేశాలకు గురైన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన జవహర్ బాబును పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా బలమైన సంకేతాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆ ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించారు.