sankranti holidays: ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి అంటే...!
- పల్లెల పెద్ద పండుగ సంక్రాంతి
- ఏపీలో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అని తెలిపిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి
- సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వినతి
గ్రామీణ ప్రాంత ప్రజల అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగకే విద్యార్ధులకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా పనుల వల్ల ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉంటారు. అందుకే సంక్రాంతి సెలవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024 - 25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటించినందున ఈ సారి 11వ తేదీ నుంచి 15 వరకు, లేదా 12 నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.
ఇప్పటికే 2025 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూల్ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని ఆ జాబితాలో పేర్కొంది.