Sankranti Festival: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు
- హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు
- పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో జీరో టికెట్ కొనసాగింపు
- సంక్రాంతికి 2,400 బస్సులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
హైదరాబాద్‌లో ఉంటూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది శుభవార్తే. నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు నేడు ప్రకటించనున్నారు.
ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఈ బస్సులు నడవనున్నాయి. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. అయితే, ఎప్పట్లానే అది పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితం. అయితే, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే జీరో టికెట్ వర్తిస్తుంది. ఆ తర్వాత మాత్రం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జనవరి తొలి వారం నుంచి 17వ తేదీ వరకు పది రోజులపాటు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఏపీఎస్ ఆర్టీసీ కూడా..
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది. జనవరి 9 నుంచి 13 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని సాధారణ చార్జీలతోనే నడపనున్నట్టు అధికారులు తెలిపారు.