Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?.. ఆస్ట్రేలియా చేరుకున్న చీఫ్ సెలక్టర్
- ఆసీస్ పర్యటన తర్వాత ప్రకటన వెలువడే అవకాశం
- డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా చేరుకోకుంటే రిటైర్‌మెంట్ దాదాపు ఖాయం!
- ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
- రిటైర్‌మెంట్‌పై రోహిత్ చర్చలు జరపనున్నట్టు కథనాలు
టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులకే తను ఔట్ అయ్యాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 22 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో, రోహిత్ శర్మ క్రికెట్ భవిష్యత్తుపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. అతడి రిటైర్‌మెంట్‌పై ఒక్కసారిగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే ఉన్నారని, రోహిత్ భవిష్యత్తు గురించి చర్చించే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకోవడంలో టీమిండియా విఫలమైతే టెస్టు క్రికెట్‌కు హిట్‌మ్యాన్ వీడ్కోలు పలకడం దాదాపు ఖాయమని తెలిపింది.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో, చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
ఇదిలావుంచితే, రోహిత్ శర్మ వరుస వైఫల్యాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అతడు బద్ధకంగా కనిపిస్తున్నాడని, మైదానంలో చురుకుగా కదలలేకపోతున్నాడని, వయసు ప్రభావం కావొచ్చంటూ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. రోహిత్ శర్మ ఫుట్‌వర్క్‌లో లోపాలను ఆయన ఎత్తి చూపించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతడి లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషించారు.