Manmohan Singh: మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవిత విశేషాలు పంచుకున్న కూతురు దామన్ సింగ్
- కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారని వెల్లడి
- పస్తులు ఉండడం, క్యాడ్‌బరీ చాక్లెట్ తిని కడుపు నింపుకున్న సందర్భాలు ఉన్నాయన్న దామన్ సింగ్
- ఆయన బయట ఆహారం ఎప్పుడూ తినలేదని వెల్లడి
- ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గుర్‌శరణ్’ పుస్తకంలో విశేషాలను పంచుకున్న దామన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూతపై యావత్ దేశం సంతాపం తెలియజేస్తోంది. రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా, అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా, పలు ఉన్నత పదవులు చేపట్టిన ఆయన గురించి చాలా మంది రాజకీయ నాయకులు, పలు రంగాల ప్రముఖులు చాలా విశేషాలు పంచుకున్నారు. అయితే, మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను ఆయన కూతురు దామన్ సింగ్ వెల్లడించారు.
1950వ దశకం మధ్యలో మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌పై చదువుతున్న రోజుల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారని దామన్ సింగ్ తెలిపారు. ‘‘నాడు మన్మోహన్ సింగ్‌కు డబ్బు ఒక్కటే అసలైన సమస్య. పస్తులు ఉండడం లేదా క్యాడ్‌బరీ చాక్లెట్ తిని కడుపు నింపుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి’’ అని ఆమె చెప్పారు.
‘‘కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు కలుపుకొని ఏడాదికి సుమారు 600 పౌండ్‌లు ఖర్చు అయ్యేవి. కానీ, పంజాబ్ విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్ రూపంలో ఏడాదికి 160 పౌండ్‌లు అందజేసేది. అందుకే డబ్బులు లేక చాలా బాధలు ఎదుర్కొన్నారు. అవసరమైన మిగతా డబ్బు కోసం తండ్రిపై ఆధారపడేవారు. మన్మోహన్ సింగ్ చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టేవారు. డైనింగ్ హాల్‌లో సబ్సిడీతో కూడిన భోజనం తినేవారు. ఆయన ఎప్పుడూ బయట ఆహారం తినలేదు’’ అని దామన్ సింగ్ వివరించారు.
చిన్నప్పుడు కూడా కష్టాలే
ఇక, చిన్నప్పుడు పాకిస్థాన్‌లో గడిపిన రోజుల్లో కూడా మన్మోహన్ సింగ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని దామన్ సింగ్ వెల్లడించారు. జీవితం చాలా కష్టంగా ఉండేదంటూ తరచుగా మాట్లాడేవారని ప్రస్తావించారు. ప్రస్తుతం పాక్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ పశ్చిమ ప్రాంతంలోని గాహ్‌లో జన్మించారని వివరించారు. ‘‘ తిరిగి పాకిస్థాన్ వెళ్లాలనుకుంటున్నారా అని నాన్నను నా సోదరి అడిగింది. అస్సలు ఇష్టం లేదని బదులిచ్చారు. నా తాతయ్యను చంపేసిన ప్రాంతానికి వెళ్లను అన్నారు’’’ అని దామన్ గుర్తు చేసుకున్నారు.
కుటుంబ సమావేశాలు, పిక్నిక్‌లలో మన్మోహన్ సింగ్ జానపద గేయాలు పాడేవారని దామన్ పేర్కొన్నారు. ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గుర్‌శరణ్’ అనే పుస్తకంలో దామన్ సింగ్ ఈ విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రుల జీవత విశేషాలను ఆమె ఇందులో పంచుకున్నారు. 2014లో హార్పర్‌కాలిన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.