TTD: సిఫార్సు లేఖలపై టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

TTD Key Announcement in the Name of Vaikunta Dwara Darshan

  • వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు 10 రోజుల పాటు నో సిఫార్సు లేఖ‌లు
  • జ‌న‌వ‌రి 10 నుంచి 19వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు
  • వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యమ‌న్న ఈఓ శ్యామ‌ల రావు

వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు ప‌ది రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలిపింది. అంతేగాక ప్రోటోకాల్ ప్ర‌ముఖులు స్వ‌యంగా వ‌స్తేనే బ్రేక్ ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. 

వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు అధిక ప్రాధాన్యత‌ ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టీటీడీ ఈఓ శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈరోజు డ‌య‌ల్ యువ‌ర్ టీటీడీ ఈఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా భ‌క్తులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై కూడా ఈఓ మాట్లాడారు. జ‌న‌వ‌రి 10 నుంచి 19వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 300 విలువ చేసే 1.40లక్ష‌ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొన్నారు. 

జ‌న‌వ‌రి 8 నుంచి 19వ తేదీ వ‌ర‌కు దాత‌ల‌కు గ‌దుల కేటాయింపు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. అలాగే జ‌న‌వ‌రి 7న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఆల‌యంలో వృద్ధులు, మ‌హిళ‌ల ప‌ట్ల సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు భ‌క్తుల నుంచి ఫిర్యాదులు వ‌చ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఈఓ శ్యామ‌ల రావు తెలుపుతూ.. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

  • Loading...

More Telugu News