Nitish Reddy: తెలుగు తేజం నితీశ్ రెడ్డి తొలి సెంచరీ.. స్టేడియంలోనే ఉన్న తండ్రి ఆనంద బాష్పాలు

Nitish Reddy Hits Maiden Ton at MCG and made a History

  • టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్‌రౌండర్ శతకం
  • 176 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించిన యువకెరటం
  • స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన టీమిండియా ఆటగాళ్లు
  • భావోద్వేగానికి గురైన నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి
  • ముగిసిన మూడవ రోజు ఆట.. భారత స్కోరు 358/9

తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి సత్తా చాటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో శతకం సాధించాడు. భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 176 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. స్కాట్ బోలాండ్ ఓవర్‌లో బౌండరీ కొట్టి తనదైన శైలిలో శతకం పూర్తి చేసుకున్నాడు.

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ కావడంతో టీమిండియా ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను అభినందిస్తూ స్టేడియంలోని ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు. టీమిండియా తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

అద్భుతమైన ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ నమోదు చేసిన అతిపిన్న భారత క్రికెటర్లలో ఒకడిగా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు. 21 సంవత్సరాల 216 రోజుల వయసులో నితీశ్ శతకం నమోదయింది. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్ (18 ఏళ్ల 256 రోజులు), రిషబ్ పంత్ (21 సంవత్సరాల 92 రోజులు) ఉన్నారు.

నితీశ్ సెంచరీపై తండ్రి భావోద్వేగం
నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీపై తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలోనే ఉన్న ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ ఆనంద బాష్పాలు కా ర్చారు. ‘‘మా కుటుంబానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. మా జీవితంలో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేము. నా కొడుకు 14-15 సంవత్సరాల వయసు నుంచే చక్కగా ఆడుతున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. నాకు ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి’’ అని అన్నారు. కాగా, నితీశ్ కుమార్ 99 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు భారత జట్టు  9 వికెట్లు కోల్పోయినప్పుడు ఎలా అనిపించిందని ప్రశ్నించగా... చాలా టెన్షన్ పడ్డానని ముత్యాలరెడ్డి చెప్పారు.

ముగిసిన మూడవ రోజు ఆట
కాగా, నితీశ్ రెడ్డి సెంచరీ పూర్తయిన వెంటనే వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ కొద్దిసేపటికే మూడవ రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 358/9గా ఉంది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి 105, మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది.

  • Loading...

More Telugu News