Pawan Kalyan: 11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు... తోలు తీసి కూర్చోబెడతాం: పవన్ కల్యాణ్
- వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంపీడీవో జవహర్ బాబు
- రిమ్స్ ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన పవన్ కల్యాణ్
- ఎంపీడీవోపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామన్న పవన్
- మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్య
- సీఐ వెళితే కానీ పరిస్థితి కంట్రోల్ కాలేదన్న పవన్
వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. దాడి గురించి బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 'నేనున్నా... మీరు ధైర్యంగా ఉండండి' అని వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని చెప్పారు. జవహర్ బాబును దారుణంగా కొట్టారని... ఆయనపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా పలువురు అధికారులపై దాడి చేశాడని తెలిపారు.
ఇంకా వైసీపీ రాజ్యం నడుస్తోందని అనుకుంటున్నారని... 11 సీట్లు వచ్చినా వీళ్లకు ఇంకా అహంకారం తగ్గలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవోపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామని చెప్పారు. సీఐ వెళితే గానీ పరిస్థితి కంట్రోల్ కాలేదని చెప్పారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో కూటమి ప్రభుత్వానికి తెలుసని... చేసి చూపిస్తామని హెచ్చరించారు.
జవహర్ బాబును చంపుతామని బెదిరించారని... ఇలాంటి నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే భయపడే పరిస్థితి రావాలని పవన్ అన్నారు. మండల స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం పరిపాటి అయిందని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పులివెందుల ప్రాంతంలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని... దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు.