KTR: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో డబ్బు చెల్లింపుతో నాకేం సంబంధం లేదు: హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్
- ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదన్న కేటీఆర్
- ఒప్పందం అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని వెల్లడి
- రూ.10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదన్న కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఈరోజు అఫిడవిట్ సమర్పించారు. ఈ-కార్ రేసింగ్ కేసుపై ఏసీబీ విచారణ జరుపుతోంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.
దీంతో కేటీఆర్ ఈరోజు రిప్లై ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒప్పందం అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని తెలిపారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై పర్మిషన్కు సంబంధించి సంబంధిత బ్యాంకు చూసుకోవాలని అందులో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ ను ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించి లీగల్ ఇష్యూస్ హెచ్ఎండీఏ సంస్థ పరిగణనలో ఉంటాయన్నారు. అలాగే రూ.10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదన్నారు. నగర, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ వ్యవహారాల్లో తనకు సంబంధం లేదన్నారు.