Digital Arrest: డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు... అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దు: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు

AP DGP talks about Digital Arrest the word used by cyber fraudsters
  • ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసగాళ్ల బెదిరింపులు
  • పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు
  • సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్న డీజీపీ
  • ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట... డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిణామాలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. 

గత కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. 2024లో సైబర్ నేరాల ద్వారా మోసగాళ్లు రూ.1,229 కోట్లు తస్కరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టడంపై ఇప్పటిదాకా 572 కేసులు నమోదు చేశామని, ఆయా కేసుల్లో నిందితులపై రౌడీ షీట్ తరహాలో సైబర్ షీట్ తెరుస్తామని చెప్పారు.

మార్చి 31 నాటికి కమాండ్ కంట్రోల్ కార్యాలయంతో 1 లక్ష సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఈగల్' వ్యవస్థ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ప్రజల్లోకి బలంగా వెళుతోందని అన్నారు. గంజాయి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని గిరిజనులకు చెబుతున్నామని డీజీపీ వెల్లడించారు. 

ఇక, దేశంలో తొలిసారిగా ఏపీలోనే 'స్మార్ట్ పోలీస్ ఏఐ'ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు 'స్మార్ట్ పోలీస్ ఏఐ'ని ప్రారంభించారని వివరించారు. నేరాల నమోదు నుంచి కేసు విచారణ వరకు 'స్మార్ట్ పోలీస్ ఏఐ' సాంకేతికత సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. విజయవాడలో ట్రాఫిక్, ప్రజా రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికత ఓ అస్త్రంలా ఉపయోగపడుతుందని తెలిపారు. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతా వలయంలోకి నకిలీ ఐపీఎస్ చొరబడడం పట్ల విచారణ జరుపుతున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. 
Digital Arrest
Cyber Crimes
DGP
Police
Andhra Pradesh

More Telugu News