Nitish Kumar Reddy: హోటల్లో నితీశ్ ను కలిసి భావోద్వేగాలను పంచుకున్న కుటుంబ సభ్యులు... వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ

Family Members met Nitish Kumar in hotel after his remarkable century
  • మెల్బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ సెంచరీ
  • టీమిండియాకు ఆపద్బాంధవుడిలా మారిన తెలుగుతేజం
  • సంతోషం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
టెస్టుల్లో తన తొలి సెంచరీ నమోదు చేయడమే కాదు, మెల్బోర్న్ టెస్టులో టీమిండియా పరిస్థితిని కూడా మార్చేసిన 21 ఏళ్ల యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పేరు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మార్మోగుతోంది. పంత్ అవుట్ కావడంతో క్రీజులో వచ్చిన నితీశ్... వాషింగ్టన్ సుందర్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నాడు. ఫాలో ఆన్ గండం తప్పించడమే కాదు, ఈ మ్యాచ్ పై కాస్తో కూస్తో ఆశలు కల్పించాడు. 

ఇక, నితీశ్ సెంచరీ సాధించడాన్ని అతడి కుటుంబ సభ్యులు మెల్బోర్న్ క్రికెట్ సేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అతడి తండ్రి ముత్యాలరెడ్డి తన బిడ్డ తొలి శతకం నమోదు చేయడం చూసి కంటతడి పెట్టారు. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్ ను హోటల్ గదిలో కుటుంబ సభ్యులు కలుసుకుని, తమ భావోద్వేగాలను అతడితో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

తండ్రి, తల్లి, సోదరి రాకతో నితీశ్ ముఖం వెలిగిపోయింది. తన కల నెరవేర్చిన నితీశ్ ను హత్తుకున్న తండ్రి ముత్యాలరెడ్డి... ఆప్యాయంగా ముద్దాడారు. తన కుమారుడు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడని, అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ముత్యాలరెడ్డి పేర్కొన్నారు.

కాగా, నితీశ్ కుమార్ టీమిండియా స్థాయికి చేరడానికి ఆయన తండ్రి ముత్యాలరెడ్డి త్యాగాలు చేశారు. కొడుకు కెరీర్ ను తీర్చిదిద్దడం కోసం తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. విశాఖ నుంచి ఉదయ్ పూర్ ట్రాన్స్ ఫర్ కావడంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పాతికేళ్ల సర్వీసు ఉండగానే, హిందూస్థాన్ జింక్ లో ఉద్యోగం వదిలేయడంతో, అనేక ఆర్థిక కష్టనష్టాలు ఎదురైనా, కొడుకును అంతర్జాతీయ క్రికెటర్ గా చూడాలన్న కలతో ఆయన ముందడుగు వేశారు. 

నితీశ్ కూడా తండ్రి లక్ష్యానికి అనుగుణంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియా తలుపుతట్టాడు. ఐపీఎల్-2023, 2024 సీజన్లలో రాణించడం ద్వారా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే చాన్స్ రాగా, ఆ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. నాలుగో టెస్టులో అద్భుతమైన సెంచరీతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగు వేశాడు.
Nitish Kumar Reddy
Century
Family Members
Melbourne
Team India
Australia

More Telugu News