Indigo: ముంబై-ఇస్తాంబుల్ విమానంలో సాంకేతిక సమస్య... 16 గంటలు విమానాశ్రయంలోనే ప్రయాణికులు
- ఈరోజు ఉదయం 6.55 గంటలకు ముంబై నుంచి టేకాఫ్ కావాల్సిన విమానం
- టేకాఫ్ రాత్రి 11 గంటలకు రీషెడ్యూల్
- తమకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదంటూ ప్రయాణికుల ఆగ్రహం
ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య కారణంగా కొన్ని గంటలుగా మహారాష్ట్ర రాజధాని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విమానం ఈ రోజు ఉదయం గం.6.55కు ముంబై నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ బయలుదేరాలి. కానీ టేకాఫ్ రాత్రి 11 గంటలకు రీషెడ్యూల్ చేశారు. అంటే విమానం టేకాఫ్ కావడానికి 16 గంటలు ఆలస్యమవుతోంది.
అసలు ఇండిగో యాజమాన్యం నుంచి ఎలాంటి అప్ డేట్ లేదంటూ ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. ఆపరేషనల్ కారణాల వల్ల విమానం ఆలస్యమైనట్లు ఇండిగో వివరణ ఇచ్చింది.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆన్ బోర్డు విమానంలో కూర్చోబెట్టారని, దీంతో తాము కన్ఫ్యూజ్ అయ్యామని ఓ ప్రయాణికుడు పేర్కొన్నారు. తమకు 13 గంటల తర్వాత తాగటానికి ఓ వాటర్ బాటిల్ మాత్రం ఇచ్చారని మరో ప్రయాణికుడు ఆరోపించాడు. లోపల ఏసీ నిలిపివేయడంతో అసౌకర్యానికి గురైనట్లు ఇంకో ప్రయాణికుడు ఆరోపించాడు.
ఈ విమానం టేకాఫ్ సమయం పలుమార్లు వాయిదా పడింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమను డీబోర్డు-బోర్డు చేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విమాన సర్వీస్ రీషెడ్యూలింగ్ లేదా టిక్కెట్ రీఫండ్ అంశం గురించి కూడా తమకు సిబ్బంది సమాచారం ఇవ్వలేదని వాపోయారు.