Nitish Kumar Reddy: బాహుబలి స్టైల్ సెలబ్రేషన్ ఎందుకు?.. అద్భుత సెంచరీపై తొలిసారి స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి

I dreamt about making him proud says Nitish Kumar Reddy on hi maiden Test hundred

  • నాన్న కన్నీళ్లు చూశాను.. ఆయన గర్వపడేలా చేయాలనుకున్నాను
  • దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాకు అతిపెద్ద ప్రేరణ
  • ఈ సెంచరీ నాకు చిరస్మరణీయమైనది
  • మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీపై తొలిసారి స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత శతకం సాధించిన విషయం తెలిసిందే. 8వ స్థానంలో బ్యాటింగ్‌‌కు దిగి సెంచరీ సాధించడం ద్వారా టీమిండియాను ఫాలో‌-ఆన్ గండం నుంచి తప్పించాడు. హాఫ్ సెంచరీని ‘పుష్ప’ స్టైల్‌లో, సెంచరీని ‘బహుబలి’ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

టెస్ట్ కెరీర్‌లో సాధించిన తొలి సెంచరీపై నితీశ్ రెడ్డి మొదటిసారి స్పందించాడు. నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం చూశానని, ఆయన గర్వపడేలా చేయాలని కలలు కన్నానని చెప్పాడు. సెంచరీ తర్వాత బాహుబలి పోజు ఇవ్వడంపై మాట్లాడుతూ... ‘‘ సెంచరీ పూర్తయ్యాక బ్యాట్‌ను గ్రౌండ్‌లో నిటారుగా ఉంచి దానిపై హెల్మెట్‌ను ఉంచాను. హెల్మెట్‌పై మన జాతీయ జెండా ఉంది. ఆ జెండాకు వందనం చేశాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తనకు అతిపెద్ద ప్రేరణ అని, ఈ సెంచరీ తనకు చిరస్మరణీయమైనదని నితీశ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

సెంచరీ సాధించడానికి అవసరమైన చివరి పరుగు సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై నితీశ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘మీకో విషయం తెలుసా. ‘నేను సాధించగలను’ అనే మనస్తత్వంతో సిరాజ్ ఉంటాడు. దానిని మరింత పెంచుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని మెచ్చుకున్నాడు. కాగా, నితీశ్ వ్యక్తిగత స్కోరు 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్, ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యారు. దీంతో నితీశ్ సెంచరీ సాధిస్తాడా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరి వికెట్‌గా క్రీజులో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్ జాగ్రత్తగా మూడు బంతులను డిఫెన్స్ ఆడి నితీశ్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. దీంతో అద్భుతమైన ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News