Melbourne test: నితీశ్ కుమార్ రెడ్డి ఔట్.. భారత్ ఆలౌట్.. వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా
- తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు భారత్ ఆలౌట్
- వ్యక్తిగత స్కోరు 114 పరుగుల వద్ద నితీశ్ కుమార్ రెడ్డి క్యాచ్ ఔట్
- తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు దక్కిన 116 పరుగుల ఆధిక్యం
- రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ల వేట ఆరంభించిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు 358/9గా ఉండగా.. నాలుగో రోజు ఆట ఆరంభంలో మరో 11 పరుగులు జోడించి 369 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి వికెట్‌ను నాథన్ లియోన్ పడగొట్టాడు. వ్యక్తిగత స్కోరు 114 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
14 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసిన మహ్మద్ సిరాజ్ నాటౌట్‌గా క్రీజులో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఆస్ట్రేలియాకు 116 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు సామ్ కొంస్టాస్‌ను జస్ప్రీత్ బుమ్రా, ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపారు. ఆస్ట్రేలియా ప్రస్తుతానికి 155 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.