BRS: కేటీఆర్ పై ప్రేమను చాటుతూ పాటపాడిన తనయుడు హిమాన్షు
- వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను చాటుకుంటున్న కేసీఆర్ మనుమడు హిమాన్షు
- తనయుడు హిమాన్షు ఇచ్చిన పుట్టిన రోజు కానుకకు ఫిదా అయిన కేటీఆర్
- తనపై ప్రేమను చాటుతూ కుమారుడు హిమాన్షు పాడిన పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను కనబరుస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు కావడంతో అతను నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి.
గత ఏడాది ఓ ఇంగ్లిష్ సాంగ్ (గోల్డెన్ అవర్) ఆలపించి అందరి మన్ననలు పొందారు. తాజాగా తన తండ్రి పట్ల తనకు ఉన్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేస్తూ హిమాన్షు ఓ పాట పాడాడు. కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా జులైలోనే హిమాన్షు ఓ పాట పాడాడు. యానిమల్ మూవీలోని ‘ఓ నాన్న నువ్వు నా ప్రాణం’ అనే పాటను హిమాన్షు రికార్డు చేశాడు. అయితే ఈ పాటను తాజాగా కేటీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేస్తూ.. తన పుట్టిన రోజు కానుకగా తన కొడుకు హిమాన్షు ఈ పాటను పాడాడని పేర్కొన్నాడు.
కానీ అది సంతృప్తికరంగా రాలేదని విడుదల చేయలేదన్నారు. అయితే ఆ పాటను తాను వారం క్రితం మరోసారి విన్నానని, హిమాన్షు గానం, పాటలోని సాహిత్యం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఈ కష్టతరమైన ఏడాదిలో తనకు దక్కిన ఉత్తమ బహుమతి అని కేటీఆర్ హిమాన్షును ప్రశంసించారు. తన గాత్రంతో ఉత్తమ బహుమతి అందించిన కుమారుడు బింకు (హిమాన్షు)కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఓ తండ్రిగా గర్వపడుతున్నానన్నారు.