Melbourne Test: మెల్‌బోర్న్ టెస్ట్: ముగిసిన నాలుగో రోజు ఆట.. 300 దాటిన ఆసీస్ ఆధిక్యం

Melbourne Test 4th Day Stump Australia Leads 333 Runs

  • 333 పరుగులకు చేరుకున్న ఆసీస్ ఆధిక్యం
  • జట్టును ఆదుకున్న కెప్టెన్ కమిన్స్, నాథన్ లియాన్
  • ప్రస్తుతం భారత్‌పైనే ఒత్తిడి
  • రేపు కూడా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే భారత్‌కు కష్టాలు తప్పనట్టే

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొంటే ఆసీస్ లీడ్ 333 పరుగులకు చేరింది. 

భారత జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ కోలుకోలేని దెబ్బతీశారు. పదునైన బంతులతో బ్యాటర్లను వణికించారు. వీరి దెబ్బకు వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియాన్ (41) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇద్దరూ కలిసి నెమ్మదిగా పరుగులు సాధిస్తూ స్కోరు బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయారు. 41 పరుగులు చేసిన కమిన్స్‌ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం నాథన్ లియాన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 358/9 వద్ద ఈ ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు మరో 11 పరుగులు మాత్రమే జోడించి 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. నిన్న అద్భుత సెంచరీతో చెలరేగిన నితీశ్‌కుమార్‌రెడ్డి 114 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడంతో భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 

ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యం సాధించి బలమైన పొజిషన్‌లోనే ఉంది. ఆటకు రేపు చివరి రోజు కావడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నేటిలాగే రేపు కూడా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే భారత్‌కు కష్టాలు తప్పనట్టే. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా అడ్డుకోగలిగితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది.

  • Loading...

More Telugu News