Rohit Sharma: ఆస్ట్రేలియాలో ఫ్లాప్ షో.. రోహిత్, కోహ్లీ రిటైరయ్యే సమయం వచ్చేసిందా?.. రవిశాస్త్రి ఏమన్నాడంటే..!
- మూడు టెస్టుల్లో కలిపి రోహిత్ చేసింది 31 పరుగులే
- పెర్త్ టెస్టులో సెంచరీ తర్వాత దారుణంగా విఫలమవుతున్న కోహ్లీ
- విరాట్ మరో మూడునాలుగేళ్లు ఆడతాడన్న రవిశాస్త్రి
- రోహిత్ మాత్రం ఈ సిరీస్ ముగిసే లోపు ఆలోచించుకోవాలన్న మాజీ కోచ్
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సారథి రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొనసాగుతుండటంతో వారి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాత మాత్రం వరుసగా 7, 11, 3, 36, 5 పరుగులు చేసి నిరుత్సాహ పరిచాడు.
ఇక రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో కలిపి చేసింది 31 పరుగులు మాత్రమే. వరుసగా 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో భారత్ 0-3తో వైట్ వాష్ అయింది. ఈ సిరీస్‌లో రోహిత్ 91 పరుగులు చేయగా, కోహ్లీ 93 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో వారిద్దరి రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా మాజీ సారథి, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ మరో మూడునాలుగేళ్లు టెస్టు క్రికెట్ ఆడతాడని పేర్కొన్నాడు. అదే సమయంలో రోహిత్ గురించి మాట్లాడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిశాక కెరియర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టులో అత్యంత అవసరమైన సమయంలో వీరిద్దరూ దారుణంగా విఫలమైన నేపథ్యంలో శాస్త్రి ఇలా స్పందించాడు.