Manmohan Singh: మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలంటూ అప్పట్లోనే ప్రణబ్ ప్రతిపాదన
- ఆయన డైరీలో ఈ విషయం ప్రస్తావించారన్న ప్రణబ్ కూతురు
- గొప్ప ఆర్థికవేత్త అని కొనియాడినట్లు వెల్లడి
- అవార్డు విషయంపై కేబినెట్ సెక్రెటరీతోనూ మాట్లాడారని ట్వీట్
మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ కు భారత రత్న ప్రకటించాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ఆయన అంత్యక్రియలు జరిపించిన చోటనే స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. అయితే, మన్మోహన్ ను దేశ అత్యుత్తమ అవార్డు భారతరత్నతో సత్కరించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భావించారట. ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ఈ అవార్డు ప్రధానం చేయాలని ప్రతిపాదించారట. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ తాజాగా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప ఆర్థిక వేత్త, భారత ఆర్థిక రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారని శర్మిష్ట చెప్పారు. అలాంటి గొప్ప నేతను భారత రత్నతో సత్కరించడం సముచితమని 2013లోనే ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతి హోదాలో కేబినెట్ సెక్రెటరీతో మాట్లాడానని, పులక్ ఛటర్జీతో చర్చించాలని సూచించానని డైరీలో రాసుకున్నారు. నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అభిప్రాయం తెలుసుకుని చెప్పాలని కేబినెట్ సెక్రెటరీని ఆదేశించానని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగింది, మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదనే వివరాలను ప్రణబ్ తన డైరీలో వెల్లడించలేదని శర్మిష్ఠ చెప్పారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.