KTR: సినిమావాళ్లతో రేవంత్ రెడ్డి సెటిల్ చేసుకున్నారు: అల్లు అర్జున్ వ్యవహారంపై మరోసారి స్పందించిన కేటీఆర్

KTR responds on Allu Arjun issue

  • కేవలం ప్రచారం కోసమే సీఎం సినిమా వాళ్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శ
  • హామీలు, సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని వ్యాఖ్య
  • ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎంకు తెలుసని వ్యాఖ్య
  • ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసన్న కేటీఆర్

సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. కేవలం ప్రచారం కోసమే సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. హామీలు, సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారన్నారు. నిత్యం అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం పాకులాడుతున్నారని విమర్శించారు. సినిమా వాళ్లతో రేవంత్ రెడ్డి సెటిల్ చేసుకున్నారని, అందుకే ఇప్పుడేమీ మాట్లాడటం లేదన్నారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. రైతన్నలు, నేతన్నల మరణాలపైనా సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని తెలుసు

తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. బీఆర్ఎస్ క్యాడర్‌లో ఇప్పుడు విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడేది లేదన్నారు. ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో తాను ఎక్కడా మాట మార్చలేదన్నారు. చెప్పినదానికే కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ-కార్ రేసు విషయంలో మంత్రి హోదాలోనే తానే డబ్బులు చెల్లించమన్నానని తెలిపారు.

నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగకుంటే ఈసీ, ఆర్బీఐ వద్దకు ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తోందని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈడీ నుంచి తనకు నోటీసు వచ్చిందన్నారు. ఈ విషయమై తాను కోర్టులో చెబుతానన్నారు. తన విషయంలో అత్యుత్సాహం కనిపిస్తోందన్నారు. తాను ఎఫ్ఐఆర్‌ను సవాల్ చేస్తున్నానన్నారు. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏదీ ఉండదన్నారు.

ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసు

ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసని కేటీఆర్ అన్నారు. ఆయన 24 ఏళ్లు కష్టపడ్డారని, ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీని వేస్తామన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుపై కాంగ్రెస్ వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని ఎద్దేవా చేశారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలలో కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని కేటీఆర్ ధీమాగా చెప్పారు. రైతు భరోసా ఇస్తామని ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ సంక్రాంతికి కాంగ్రెస్ టోకరా ఇవ్వబోతుందన్నారు. రేవంత్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదన్నారు.

  • Loading...

More Telugu News