Revanth Reddy: శ్రీవారి దర్శనం... చంద్రబాబు లేఖపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

TG Revanth Reddy responds on AP CM Chandrababu letter

  • చంద్రబాబు లేఖ రాసినట్లు వెల్లడించిన తెలంగాణ సీఎంవో
  • చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
  • సిఫార్సు లేఖలను ఆమోదించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరినట్లు వెల్లడి

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన చంద్రబాబు... టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో కలిసి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని నేడు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు.

ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫార్సు చేయొచ్చని చంద్రబాబు తెలంగాణ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లేఖకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

  • Loading...

More Telugu News