Taliban: మహిళలు కనిపించేలా ఇళ్లలో కిటికీలు వద్దు.. తాలిబన్ల మరో ఆదేశం
- మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే అవకాశం ఉందన్న తాలిబన్లు
- ఇప్పటికే ఉన్న కిటికీలను మూసివేయాలని ఆదేశం
- తాలిబన్ల తాజా ఆదేశంపై సర్వత్ర చర్చ
ఆఫ్ఘనిస్థాన్‌ను చేజిక్కించుకున్నది మొదలు మహిళలను అణచివేయడం, వారి హక్కుల్ని కాలరాయడమే పనిగా పెట్టుకున్న తాలిబన్లు మరోమారు మహిళలపై క్రూరత్వం ప్రదర్శించే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే వారికి ఎలాంటి హక్కులు లేకుండా ఇంటికే పరిమితం చేశారు. మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితిని కల్పించారు. చదువును దూరం చేశారు. జిమ్‌లు, పార్కుల్లోకి అనుమతిని నిషేధించారు. తాజాగా జారీచేసిన ఆదేశాలు మరోమారు తాలిబన్ల గురించి చర్చించుకునేలా చేశాయి.
నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటకు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. ఇప్పటికే నిర్మించి ఉంటే వాటిని మూసివేయాలని పేర్కొన్నారు. వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చే మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే అవకాశం ఉందని, కాబట్టి వారు కనిపించకుండా గోడలు కట్టాలని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహిళలు బయటి వారికి కనిపించేలా ఇప్పటికే ఇళ్లలో ఉన్న నిర్మాణాలను మూసివేయాలని కోరారు. తాజా ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలిస్తారు.