Punjab Bandh: రైతుల 9 గంటల బంద్‌తో పంజాబ్‌లో స్తంభించిన జనజీవనం
- పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతుల డిమాండ్
- నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు
- పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్ల రద్దు
- స్తంభించిన రవాణా వ్యవస్థ
పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 9 గంటలపాటు నిర్వహించిన బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు కారణమైంది. రహదారులను మూసివేసి ధర్నాలకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపు మేరకు నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నిరసనలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి.
రైతుల బంద్ నేపథ్యంలో పంజాబ్-ఢిల్లీ మధ్య మొత్తం 163 రైళ్లను అధికారులు రద్దు చేశారు. పటియాలా-చండీగఢ్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద రైతులు ధర్నా నిర్వహించడంతో ఆ మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం గేట్ వద్ద కూడా నిరసనలు కొనసాగాయి. బంద్ విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు రైతు నేత దల్లేవాల్ వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు.