Akhilesh Yadav: సీఎం యోగి ఇంటి కింద కూడా శివలింగం.. అక్కడా తవ్వకాలు చేపట్టాలి.. అఖిలేశ్ యాదవ్ డిమాండ్

SP Chief Akhilesh Yadav Says Shivling Under UP Chief Ministers House
  • ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించేందుకే తవ్వకాలు చేస్తున్నారని అఖిలేశ్ మండిపాటు
  • ఇది అభివృద్ది కాదని, విధ్వంసమని ఆగ్రహం
  • సీఎం చేతిలో అభివృద్ధి రేఖ లేదన్న ఎస్పీ చీఫ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద కూడా శివలింగం ఉండే అవకాశం ఉందని, కాబట్టి అక్కడ కూడా తవ్వకాలు చేపట్టాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. సంభాల్‌లో మొఘలుల కాలం నాటి మసీదులో జరుగుతున్న తవ్వకాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజధాని లక్నోలో నిన్న అఖిలేశ్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించేందుకే కూల్చివేతలు చేపట్టిందని ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి నివాసం కింద కూడా శివలింగం ఉందని నమ్ముతున్నాం. అక్కడ కూడా తవ్వకాలు చేపట్టాలి. అమాయకుల ఇళ్లను బుల్డోజర్లతో అక్రమంగా కూల్చివేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం. ముఖ్యమంత్రి చేతుల్లో అభివృద్ధి రేఖ లేదు.. విధ్వంస రేఖ మాత్రమే ఉంది’’ అని పేర్కొన్నారు.
  
సంభాల్‌లో తవ్వుతుంటే మీకేంటి బాధ?
ముఖ్యమంత్రి ఇంటి కింద తవ్వకాలు జరపాలన్న అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. సంభాల్‌లో తవ్వుతుంటే ఆయనకేంటి సమస్య? అని ప్రశ్నించారు. ‘‘2013లో ఆయన (అఖిలేశ్ యాదవ్) 1000 టన్నుల బంగారాన్ని వెలికి తీసేందుకు రాష్ట్రంలోని మొత్తం యంత్రాలను ఉపయోగించారు. బంగారం తియ్యడానికి ఆయన రెడీ అయ్యారు కానీ, శివలింగం విషయంలోనే ఆయనకు ఏదో సమస్య ఉంది. అందుకే ఆయన సీఎం ఇంటి కింద తవ్వాలని డిమాండ్ చేస్తున్నారు’’ అని విరుచుకుపడ్డారు.
Akhilesh Yadav
Samajwadi Party
Shivling
Yogi Adityanath

More Telugu News