Emotional Video: తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు.. నెటిజన్ల ప్రశంసలు!
- తల్లికి మళ్లీ ప్రేమ, కొత్త జీవితాన్ని అందించిన పాకిస్థానీ యువకుడు
- తల్లి నిఖా తాలూకు భావోద్వేగ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన అబ్దుల్ అహద్
- అహద్ తన తల్లికి రెండో పెళ్లి చేసి మంచి చేశాడంటూ మెచ్చుకుంటున్న నెటిజన్లు
తల్లిపై ప్రేమతో ఓ పాకిస్థానీ యువకుడు చేసిన పని నెటిజన్ల మనసును హత్తుకుంటోంది. అబ్దుల్ అహద్ తండ్రి చిన్న వయసులోనే చనిపోయారు. దాంతో తల్లి అన్నీతానై అతడిని పెంచింది. తల్లి పెంపకంలో మంచిగా చదువుకుని అహద్ ప్రస్తుతం ఉన్నత స్థాయికి చేరాడు. జీవితంలో స్థిరపడ్డాడు.
దీంతో చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన తల్లికి మళ్లీ ప్రేమ, కొత్త జీవితాన్ని అందించాలనుకున్నాడు. తల్లిని వేరే వ్యక్తితో రెండో పెళ్లికి ఒప్పించాడు. తాజాగా బంధుమిత్రుల సమక్షంలో దగ్గరుండి అహద్ తన తల్లి నిఖా జరిపించాడు. ఈ వివాహ వేడుక తాలూకు వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
ఇన్‌స్టాలో పంచుకున్న భావోద్వేగ వీడియోలో అబ్దుల్ అహద్ తన తల్లితో గడిపిన విలువైన క్షణాలతో పాటు ఆమె నిఖా (వివాహ వేడుక) తాలూకు క్లిప్‌లను జోడించాడు.
"గత 18 సంవత్సరాలు ఆమె తన జీవితమంతా మా కోసం త్యాగం చేసింది. అందుకే ఆమెకు ప్రత్యేక జీవితాన్ని ఇవ్వడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. ఆమె తన వ్యక్తిగత ప్రశాంతమైన జీవితానికి అన్ని విధాలుగా అర్హమైనది. కాబట్టి ఒక కొడుకుగా, నేను సరైన పని చేశానని అనుకుంటున్నాను. 18 సంవత్సరాల తర్వాత ప్రేమ, జీవితంలో రెండవ అవకాశాన్ని తీసుకోవడానికి నేను మా అమ్మకు మద్దతు ఇచ్చాను" అని అబ్దుల్ వీడియోలో వివరించాడు.
ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అహద్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. "అమ్మ కోసం నీవు గొప్ప పని చేశావు", "వరల్డ్‌లోనే ది బెస్ట్ సన్", "ఒంటరి జీవితం చాలా కష్టం. అందులోనూ జీవిత చరమాంకంలో తప్పనిసరిగా తోడు ఉండాల్సిందే. నీవు అది అందిచావు. నిజంగా చాలా మంచి పని చేశావు" అంటూ నెటిజన్లు అబ్దుల్ అహద్‌ను మెచ్చుకుంటున్నారు.