Chandrababu: పింఛను లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి కాఫీ తయారు చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో!
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం
- యలమంద గ్రామంలో స్వయంగా పింఛన్లను అందించిన చంద్రబాబు
- ఏడుకొండలు అనే లబ్ధిదారుడి ఇంట్లో కాఫీ తయారు చేసిన సీఎం
ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను అందిస్తోంది. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం రూ. 2,717 కోట్లను విడుదల చేసింది. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 90 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు.
పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయాడు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కూతురుకి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష రుణం, మరో రూ. 2 లక్షలు సబ్సిడీగా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు.
మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు... వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు.