Nassar: మా అబ్బాయి ప్రాణాలు నిలబెట్టింది హీరో విజయ్: నటుడు నాజర్
- నటుడిగా నాజర్ కి మంచి పేరు
- ఆ మధ్య ఆయన తనయుడికి జరిగిన ప్రమాదం
- విజయ్ పేరును పలవరించిన నాజర్ తనయుడు
- అతని కోసం హాస్పిటల్ కి వచ్చిన విజయ్
నాజర్ .. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఫుల్ బిజీ. ఎంతమంది ఆర్టిస్టులు కొత్తగా వెండితెరకి పరిచయమవుతున్నప్పటికీ, ఆయన స్థానానికి దగ్గరగా ఎవరూ రాలేకపోయారు. అనేక భాషలలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన నాజర్ కి ఎంతో గుర్తింపు ఉంది .. గౌరవం ఉంది. అలాంటి నాజర్ ఆ మధ్య ఒక్కసారిగా కుంగిపోయారు. అందుకు కారణం ఆయన తనయుడికి జరిగిన ప్రమాదం .. అతను కొన్ని రోజుల పాటు కోమాలోకి వెళ్లడం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటనను గురించి నాజర్ ప్రస్తావించారు. "మా అబ్బాయికి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. 14 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. ఏ క్షణంలో డాక్టర్లు ఏం చెబుతారోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను. అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని నేను కోరుకున్నాను. ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ నాకు భయంగానే ఉంటుంది. మా అబ్బాయి కోలుకోవడానికి కారకుడు హీరో విజయ్ అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను" అని అన్నారు.
" కోమాలో నుంచి మా అబ్బాయి బయటికి వచ్చాడని తెలిసి మేము చాలా సంతోషించాము. అతను మా పేర్లు చెబుతాడని మేము అనుకున్నాము. కానీ అతను హీరో 'విజయ్' గురించి అడిగాడు. మా వాడికి విజయ్ అంటే పిచ్చి. ఆ విషయం తెలియగానే డాక్టర్లు విజయ్ సినిమాలు .. సాంగ్స్ చూపిస్తూ వెళ్లారు. అప్పటి నుంచే అతను నిదానంగా కోలుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలియగానే విజయ్ నేరుగా హాస్పిటల్ కి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆయన వల్లనే మా అబ్బాయి కోలుకున్నాడని నమ్ముతాను. ఇప్పుడు విజయ్ .. మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు" అని చెప్పారు.