TTD: టీటీడీలో జరిగిన అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళతాం: భానుప్రకాశ్ రెడ్డి

Bhanuprakash Reddy says they will bring illegal activities in TTD to CM
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలి సభ్యుడు
  • గత ప్రభుత్వ హయాంలో టీటీడీని దోచుకున్నారని వెల్లడి
  • అక్రమార్కులతో రాజీ చేసుకున్నారని ఆరోపణ
ఏపీ బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టేట్లుగా మార్చారని మండిపడ్డారు. టీటీడీలో అక్రమాలు చేసిన వారిని తప్పించే ప్రయత్నాలు చేశారని, అక్రమార్కులతో రాజీ చేసుకుని కేసులు పెట్టకుండా వదిలేశారని ఆరోపించారు. 

వైసీపీ హయాంలో టీటీడీలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని, భక్తులు సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేశారని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. 

"టీటీడీలో విజిలెన్స్ అధికారిగా పనిచేసిన శివశంకర్ అక్రమాలు చేశారు. అక్రమాలకు పాల్పడిన శివకుమార్ పై చర్యలు తీసుకోలేదు... శివశంకర్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. శివశంకర్ డిప్యుటేషన్ రద్దు చేసి సొంత శాఖకు పంపించారు. 

పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ ను తప్పించారు. రవికుమార్ ను తప్పించడంలో శివశంకర్ కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలను ముఖ్యమంత్రికి వివరిస్తాం" అని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
TTD
Bhanuprakash Reddy
BJP
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News