Komatireddy Venkat Reddy: కొత్త సంవత్సరం రోజున కేటీఆర్ ను బాధ పెట్టవద్దు.. రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి: కోమటిరెడ్డి
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- తీర్పు ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశం
- 3, 4 తేదీల్లో కేటీఆర్ గురించి చూద్దామని వ్యాఖ్య
ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చేంత వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ... కొత్త సంవత్సరం రోజున కేటీఆర్ ను బాధ పెట్టవద్దని ఎద్దేవా చేశారు. న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయనివ్వాలని చెప్పారు. ఒక రెండు రోజులు ఎంజాయ్ చేయనిద్దామని... జనవరి 3, 4 తేదీల్లో కేటీఆర్ గురించి చూద్దామని వ్యాఖ్యానించారు.
నల్గొండ జిల్లా ప్రజల దశాబ్దాల కల ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి చెప్పారు. 4 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ నీరు ఇస్తుందని అన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పని చేయరని... కాంట్రాక్టర్లు పని చేయకపోతే మంత్రికి చెప్పాలని సూచించారు. అధికారులు సీరియస్ గా పని చేస్తే ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయవచ్చని చెప్పారు. ఎస్ఎల్బీసీ ఒక వరల్డ్ వండర్ అని... ఇది పూర్తయితే ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు.