Anand Mahindra: న్యూఇయర్ సందర్భంగా పంజాబ్ పోలీసుల సెటైరికల్ ఆఫర్... స్పందించిన ఆనంద్ మహీంద్రా
- యువతను అప్రమత్తం చేసేలా పంజాబ్ పోలీసుల కొత్త తరహా సూచనలు
- రోడ్ల మీద గొడవలు చేస్తే పోలీస్ స్టేషన్‌కు ఉచిత ఎంట్రీ అంటూ వినూత్న ఆఫర్!
- సోషల్ మీడియాను వినూత్నంగా ఉపయోగిస్తున్నారంటూ పోలీసులపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
న్యూఇయర్ వేడుకల సందర్భంగా పంజాబ్ పోలీసులు ఇచ్చిన ప్రత్యేక ఆఫర్ల పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా యువతను అప్రమత్తం చేసేందుకు పంజాబ్ పోలీసులు కొత్త తరహా సూచనలు జారీ చేశారు.
2025 కొత్త ఏడాది నేపథ్యంలో అధికంగా మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్ల మీద గొడవలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే ప్రత్యేక ఆఫర్లు అందజేయనున్నట్లు పోలీసులు హెచ్చరిక చేసేలా ఆఫర్లు ప్రకటించారు.
పై చర్యలకు పాల్పడితే పోలీస్ స్టేషన్‌లోకి ఉచిత ఎంట్రీ ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తామని సెటైరికల్ ఆఫర్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరి రాత్రిని నాశనం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చుట్టుపక్కల వారు 112కు ఫోన్ చేసి తమను ఆహ్వానించవచ్చని పేర్కొన్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియాను వినూత్నంగా ఉపయోగించేవారిలో పోలీసులు ఒకరని ప్రశంసించారు. ఆయన అందరికీ హ్యాపీ న్యూఇయర్ చెప్పారు.