Chandrababu: మద్యం దుకాణదారులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు... మార్జిన్ పెంపు
- ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- రిటైల్ షాపుల మార్జిన్ 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం
- గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం
మద్యం దుకాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ ను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని, మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్ ను తెలంగాణలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా 14 శాతం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇవాళ చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులు ఉండగా ఇందులో 10 శాతం అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వనున్నారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, యాత, సోంది వంటి కులాలకు 10 శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు.
ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసం అయినా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు... ఆ వివరాలను సీఎం ముందు ఉంచారు. అన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నోటిఫికేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరోవైపు రూ. 99కి మద్యం అందుబాటులోకి తేవడంపైనా చర్చించారు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతాయని... అయితే తక్కువ రేట్లకే మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయి ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా సరే తక్కువ రేటుకే మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించి... నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.