pakistan border: ప్రేమ కోసం సరిహద్దులు దాటి పోలీసులకు చిక్కాడు!
- ఫేస్బుక్లో పరిచయంతో పాక్ యువతి ప్రేమలో పడ్డ ఉత్తరప్రదేశ్ యువకుడు
- బాదల్ బాబు ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి పాక్ పోలీసులకు చిక్కిన వైనం
- బాదల్ బాబు అక్రమ చొరబాటుపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పాక్ పోలీసులు
ప్రియురాలి కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటి పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడు బాదల్ బాబుకు పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ప్రియురాలిని కలుసుకునేందుకు బాదల్ బాబు ఇండియా – పాక్ సరిహద్దును దాటి ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. దీంతో అక్కడి పోలీసులు మండి బహుద్దీన్ పట్టణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. ఈ ఘటన డిసెంబర్ 27న జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాదల్ బాబు అక్రమ ప్రవేశంపై పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదల్ బాబు పాక్ రావడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా ? లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అయితే బాదల్ బాబు పాక్ వెళ్లేందుకు ప్రయత్నించడం ఇది తొలి సారి కాదు. గతంలో రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడో సారి విజయవంతంగా ప్రియురాలి వద్దకు చేరుకున్నప్పటికీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.