Jasprit Bumrah: మరో 6 వికెట్లు తీస్తే చాలు.. జస్ప్రీత్ బుమ్రా ఖాతాలోకి ఆల్ టైమ్ రికార్డ్
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు 30 వికెట్లు తీసిన స్టార్ పేసర్
- ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించే అవకాశం
- ప్రస్తుతం 35 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న బీఎస్ చంద్రశేఖర్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. భారత జట్టు బౌలింగ్ భారాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న ఏకైక బౌలర్ అతడే. సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడిన అతడు కళ్లు చెదిరే 12.83 సగటుతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు 5 వికెట్ల ఫీట్, రెండు సార్లు 4 వికెట్లు సాధించాడు.
కాగా, సిడ్నీ వేదికగా జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా మరో 6 వికెట్లు సాధిస్తే అతడి ఖాతాలో ఒక ఆల్‌టైమ్ రికార్డు చేరుతుంది. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్‌గా అవతరించే అవకాశం అతడిని ఊరిస్తోంది. ప్రస్తుతం భారత్ తరఫున ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు మాజీ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. లెగ్ స్పిన్నర్ అయిన చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు.
సిడ్నీ టెస్టులో బుమ్రా గనుక 6 వికెట్లు తీస్తే దాదాపు 52 సంవత్సరాల రికార్డు బద్దలు కానుంది. టెస్ట్ ఫార్మాట్లో ఆల్-టైమ్ రికార్డ్‌ను సృష్టించే థ్రెషోల్డ్ వద్ద నిలిచాడు.
ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్ల తీసిన భారత బౌలర్లు
1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లాండ్‌పై)
2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లాండ్‌పై)
3. శుభాష్చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)
4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)
5. హర్భజన్ సింగ్ - 32 (ఆస్ట్రేలియా)
6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్)
7. రవిచంద్రన్ అశ్విన్ - 31 (దక్షిణాఫ్రికా)
8. బిషన్ సింగ్ బేడీ - 31 (ఆస్ట్రేలియా)
9. స్ప్రీత్ బుమ్రా - 30 (ఆస్ట్రేలియాపై ప్రస్తుతానికి).