Ram Charan: 'గేమ్ ఛేంజర్ ' హైలైట్స్ .. ఎవరేమన్నారంటే .. !
- సందడిగా జరిగిన 'గేమ్ ఛేంజర్' ఈవెంట్
- ట్రైలర్ లాంఛ్ చేసిన రాజమౌళి
- ఇది శంకర్ సినిమా అని చెప్పిన చరణ్
- ఖర్చుకి దిల్ రాజు వెనకాడలేదన్న శంకర్
- చరణ్ విశ్వరూపం చూపించాడన్న దిల్ రాజు
రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు 'గేమ్ ఛేంజర్ ' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
రాజమౌళి మాట్లాడుతూ..‘శంకర్ గారు ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ గారు తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే. శంకర్ గారు అంటే తెలుగు వారందరికీ గౌరవం. ఆ గౌరవంతోనే దిల్ రాజు గారు ఈ మూవీని శంకర్ గారితో తీసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం" అని అన్నారు.
"ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్ ఎగ్జైట్మెంట్‌ను ఇచ్చింది. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్‌కే రామ్ చరణ్ ఎంతో ఎదిగి పోయాడు. మగధీర టైంలో రామ్ చరణ్‌ను హీరో అని పిలుస్తూ ఉండేవాడ్ని. హెలికాప్టర్ నుంచి లుంగీ కట్టుకుని కత్తి పట్టుకుని దిగుతుంటే.. విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుస్తోంది. జనవరి 10న థియేటర్లోకి గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు. సాంగ్స్, యాక్షన్స్, పర్ఫామెన్స్ ఇలా అన్నింట్లో అద్భుతంగా నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారు. కియారా అద్వాని గారు రామ్ చరణ్ గారితో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
నేను ఏం అడిగినా, ఏం చెప్పినా కూడా దిల్ రాజు ఇచ్చారు. నన్ను తెలుగుకి పరిచయం చేసినందుకు దిల్ రాజు గారికి థాంక్స్. ప్రతీ రోజూ సెట్స్‌కు వచ్చి అన్నీ గమనిస్తుంటారు. శిరీష్ గారు దిల్ రాజుకు ఎంతో సపోర్ట్‌గా ఉంటారు. రెహమాన్ లేడనే లోటు నాకు తెలీకుండా తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టారు. పాటలకు చాలా వరకు కొత్త టెక్నాలజీ వాడాం. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా వచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ వద్ద కథను తీసుకుని ఈ మూవీని చేశాను. ఇది కూడా నాకు ఓ 'గేమ్ ఛేంజర్' లాంటిదే" అన్నారు.
చరణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. రాజమౌళి గారు, శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. శ్రీకాంత్ గారు, ఎస్ జే సూర్య గారు, సముద్రఖని గారు, అంజలి గారు, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చింది. అందరి పర్ఫామెన్స్‌లతోనే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది. సాయి మాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు" అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. తమిళ సినిమాను శంకర్ గారు పాన్ ఇండియాగా చేశారు. రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. డల్లాస్ ఈవెంట్‌లో చాలా మాట్లాడాం. ఇంకా నాలుగో తేదీన చాలా మాట్లాడాల్సి ఉంది. శంకర్ గారు ఇప్పటి వరకు చేసినదంతా మెల్లమెల్లగా రివీల్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే. అసలు మ్యాటర్ ఏంటో జనవరి 10న తెలుస్తుంది" అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా ఈ సినిమాను దిల్ రాజు గారు చాలా జాగ్రత్తగా దాచారు. దిల్ రాజు గారికి ఈ చిత్రంతో పెద్ద హిట్ రావాలి. జనవరి 10న ఆయనకు నేను ప్రేమగా ఓ హగ్ ఇవ్వాలి. 'బాయ్స్' నుంచి 'గేమ్ ఛేంజర్' వరకు నా ప్రయాణాన్ని శంకర్ గారు చూశారు. ఆయన మొదటి సారిగా ఓ తెలుగు సినిమాను, అది కూడా రామ్ చరణ్ గారితో చేశారు. శంకర్ గారితో నా బంధాన్ని చాటేలా ఈ మ్యూజిక్ ఉంటుంది. మా ట్రైలర్‌ను లాంచ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్" అని అన్నారు.
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ..‘గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ మూవీ. అద్భుతమైన సినిమాకు పని చేశానన్న సంతృప్తి ఉంది. శంకర్ గారితో, చరణ్ బాబు పని చేయడం ఆనందంగా ఉంది. రాజమౌళి గారు ట్రైలర్‌ను రిలీజ్ చేయడం మరింత అద్భుతం. ప్రతీ సీన్ అద్భుతంగా ఉంటుంది. రేపు వచ్చేది సంక్రాంతి కాదు.. శంకరరాత్రి’ అని అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నాలుగో తేదీ జరిగే ఈవెంట్‌లో మాట్లాడేందుకు మాటల్ని దాచిపెట్టుకో అని దిల్ రాజు గారు చెప్పారు. నాకు ఇంత మంచి కేరక్టర్ ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. ఈ పాత్రలో నేను మా నాన్న గారిని చూసుకున్నాను. రామ్ చరణ్ పర్ఫామెన్స్ ఇందులో సెట్స్ మీద, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా టైంలో కంటే రామ్ చరణ్ ఇప్పుడు ఎంతో స్థాయికి ఎదిగాడు" అని అన్నారు.
అంజలి మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైంది. ఈ పాత్రలో నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు శంకర్ గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. రామ్ చరణ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కో ఆర్టిస్ట్‌లకు చాలా కంఫర్ట్ ఇస్తుంటారు. నా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ గారికి థాంక్స్. అని అన్నారు.
ఎస్.జె.సూర్య మాట్లాడుతూ.. ‘మంచి చిత్రంతో ఈ ఏడాది ప్రారంభం అవుతోంది. 'గేమ్ ఛేంజర్' లాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. సినిమా గురించి మనం చెప్పకూడదు.. ఆ సినిమానే మాట్లాడాలని అంటుంటారు. ఈ సినిమా ఏంటో జనవరి 10న అందరికీ తెలుస్తుంది. ఒక్కో సీన్ చేస్తుంటే నేను ఎంతో సంతోషించాను. శంకర్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ మూవీని తీశారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి వెళ్లారు. సెట్‌లో మాత్రం రామ్ చరణ్ ఎంతో హంబుల్‌గా ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంక్రాంతికి ఈ సినిమాతో అందరూ ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ.. "గత ఐదేళ్లు నేను నటించిన ఏదో ఒక మూవీ సంక్రాంతికి వస్తుంది. అలా సంక్రాంతికి వచ్చిన ప్రతీ చిత్రం హిట్ అవుతూనే ఉంది. ఇంత మంచి చిత్రంలో ఇంత అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్ పక్కన బాబాయ్ పాత్రలో కనిపించాను. ఇందులో కూడా అలాంటి పాత్రలోనే నటించాను. రామ్ చరణ్ చాలా సిన్సియర్‌గా పని చేస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.