Human Metapneumovirus: కొత్త ఏడాది వేళ చైనాలో కలకలం రేపుతున్న కొత్త వైరస్.. కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
- చైనా సోషల్ మీడియాలో హోరెత్తుతున్న వార్తలు
- ‘హ్యూమన్ మెటానియా’ వైరస్ సోకి వేలాదిమంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు ప్రచారం
- దీంతోపాటు కొవిడ్, ఇన్ఫ్ల్యూయెంజా, మైకోప్లాస్మా, నిమోనియా బారినపడుతున్న ప్రజలు
న్యూ ఇయర్ వేళ చైనాలో కొత్త వైరస్ వార్తలు కలకలం రేపుతున్నాయి. దీని బారినపడుతున్న వేలాదిమంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త వైరస్‌ను ‘హ్యూమన్ మెటానియా’(హెచ్ఎంపీవీ) గా చెబుతున్నారు. ఇది శరవేగంగా విస్తరిస్తోందని, బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
అంతేకాదు, ఈ వైరస్‌తోపాటు ఇన్ఫ్ల్యూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. హ్యూమన్ మెటానియా వైరస్ సోకుతున్న వారిలో కొవిడ్ లక్షణాలే కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలు కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఒకటి పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.