China: హోటళ్లలో కస్టమర్లు తిని వదిలేసిన ఆహార పదార్థాలతో నూనె తయారు.. తిరిగి దానితోనే వంటలు!

Chinese Restaurant Busted Making Saliva Oil By Reusing Oil From Leftover Soup

  • చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఘటన
  • ప్రముఖ రెస్టారెంట్‌లో జరుగుతున్న ఈ తతంగాన్ని గుర్తించిన కస్టమర్
  • అధికారుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
  • ఆహారం రుచిని పెంచేందుకే ఇలా చేస్తున్నట్టు యజమాని అంగీకారం

రెస్టారెంట్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి, ఆపై వాటితో నూనె తయారు చేసి, దానిని కొత్త నూనెలో కలిపేసి తిరిగి వంటలకు వాడుతున్న వైనం విస్తుగొలుపుతోంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వెలుగుచూసిన ఈ విషయం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. వినియోగదారులు మిగిల్చిన చిల్లీ ఆయిల్ సూప్స్, ఇతర ఆహార పదార్థాలను రీసైక్లింగ్ చేస్తున్న రెస్టారెంట్.. దాని నుంచి నూనె సేకరించి సూప్‌లో కలిపి వడ్డిస్తోంది. 

ఓ కస్టమర్ ఈ విషయాన్ని గమనించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. దీనిని సలైవా ఆయిల్‌గా పేర్కొంటున్నారు. కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల నుంచి నూనె సేకరిస్తున్న విషయం నిజమేనని రెస్టారెంట్ యజమాని అంగీకరించాడు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇలా చేస్తున్నామని, కొత్త ఆయిల్‌తో కలిపి వంటలు చేస్తున్నట్టు చెప్పాడు. వ్యాపారం తగ్గడంతో వంటకాల రుచి పెంచేందుకే ఇలా చేస్తున్నట్టు తెలిపాడు. రీసైక్లింగ్ చేసిన ఆయిల్‌ను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

చైనాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాల నుంచి ఆయిల్ సేకరించి తిరిగి హోటళ్లకే అమ్ముతున్న ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. దీంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు 2009లో అక్కడి ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం నేరం రుజువైతే భారీ జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

  • Loading...

More Telugu News