Chandrababu: ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే: సీఎం చంద్రబాబు
- నేడు సావిత్రిబాయి పూలే 194వ జయంతి
- ఎక్స్ వేదికగా నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
- స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి సావిత్రిబాయి అంటూ కితాబు
సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ముఖ్యమంత్రి కొనియాడారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శం అన్నారు.
ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిందని గుర్తు చేశారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు మరొక్క మారు ఘననివాళి అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.