Health: టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉందా?.. పాజిటివ్ న్యూస్ చెప్పిన తాజా అధ్యయనం

New study found that drinking tea and coffee may help lower your risk of developing head and neck cancer

  • టీ లేదా కాఫీ అలవాటుతో తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందన్న అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం 
  • నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లు సోకే ప్రమాదం తక్కువని వెల్లడి
  • ‘క్యాన్సర్ జర్నల్‌’లో ప్రచురితమైన తాజా అధ్యయనం

చాలా మంది ఉదయాన్నే ఓ కప్పు టీ లేదా కాఫీ తాగనిదే తమ దైనందిన జీవితాన్ని ఆరంభించలేరు. ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఖాతరు చేయరు. అయితే, అలాంటివారికి కాస్త ఉపశమనం కలిగించే ఓ సానుకూల అంశం తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గవచ్చని ‘క్యాన్సర్ జర్నల్‌’లో ప్రచురితమైన అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం పేర్కొంది.

‘ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ కన్సార్టియం’ నిర్వహించిన ఈ అధ్యయనంలో టీ, కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పరిశోధకులు దాదాపు 14 రీసెర్చ్‌లకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. అంతేకాదు,  తల, మెడ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9,500 మందికి పైగా రోగులను, క్యాన్సర్ లేని 15,700 మందిని పరీక్షించారు. ప్రతి రోజూ టీ, కాఫీలు తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ముప్పు తక్కువని తేలినట్టు పేర్కొన్నారు.

కాఫీ తాగని వారితో పోలిస్తే రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గిందని గుర్తించారు. అలాగే, ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో ‘ఓరల్ కేవిటీ క్యాన్సర్’ ముప్పు 30 శాతం, గొంతు క్యాన్సర్ ప్రమాదం 22 శాతం తగ్గుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. 

రోజూ 3-4 కప్పుల కాఫీ తాగితే ‘హైపోఫారింజియల్ క్యాన్సర్’ ముప్పు 41 శాతం తగ్గించవచ్చని, ‘ఓరల్ కేవిటీ క్యాన్సర్’ ప్రమాదాన్ని 25 శాతం తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. కెఫిన్ లేని కాఫీ కూడా ప్రయోజనకరమేనని తెలిపింది. కాఫీతో పాటు టీ కూడా హైపోఫారింజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 29 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంది. ప్రతిరోజూ ఒక కప్పు టీ తాగితే తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9 శాతం మేర తగ్గుతుందని పేర్కొంది. ఇకహైపోఫారింజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని టీ తాగే అలవాటు దాదాపు 27 శాతం తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది.

  • Loading...

More Telugu News