Pawan Kalyan: సావిత్రిబాయి పూలేకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు
- నేడు సావిత్రిబాయి పూలే 194వ జయంతి
- మహిళా సాధికారత కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారన్న పవన్
- బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే దంపతులు ఎంతో కృషి చేశారని వ్యాఖ్య
సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్త్రీ విద్యపై మొట్టమొదటిసారి గళమెత్తిన ఉద్యమకారిణి అని, మహిళల విద్య కోసం ఎంతోగానో శ్రమించిన దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని జనసేనాని పేర్కొన్నారు. తన జీవితాన్ని మహిళలకు విద్య అందించడం కోసం, మహిళా సాధికారత కోసం అంకితం చేసిన ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు అని కొనియాడారు.
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శం అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే దంపతులు ఎంతో కృషి చేశారని పవన్ గుర్తు చేశారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం పరితపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ఘననివాళి అర్పిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.