KTR: రైతులు బిచ్చమెత్తుకోవాలని భావిస్తున్నారా?: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

KTR fires t Congress government over Rythu Bharosa

  • రైతులను దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని హితవు
  • రైతులను డిక్లరేషన్ ఇవ్వమనడంపై కేటీఆర్ ఆగ్రహం
  • రైతుబంధు పక్కదారి పట్టి ఉంటే నిరూపించాలని సవాల్

రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన... దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రైతులకు సంక్రాంతి లోపే రైతుబంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వద్దామని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. రేపటి కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు.

రైతును డిక్లరేషన్ కోరడంపై కేటీఆర్ ఆగ్రహం

రైతుల నుంచి ప్రభుత్వం డిక్లరేషన్ కోరడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదని... ప్రభుత్వమే రైతులకు ప్రమాణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రమాణ పత్రం ఇవ్వాలనేది దిక్కుమాలిన పద్ధతి అన్నారు. డిక్లరేషన్ ద్వారా రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

మొన్నటి వరకు కులగణన అంటూ డ్రామాలాడిన ప్రభుత్వం ఇప్పుడు డిక్లరేషన్ అంటున్నారని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం బొంద పెట్టిందన్నారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పట్లో నివేదిక ఇస్తుందని తాము భావించడం లేదన్నారు. ఈ ఏడాది పాటు కేబినెట్ సబ్ కమిటీ ఏం చేసిందని ప్రశ్నించారు.

రైతుబంధు పక్కదారి పడితే నిరూపించాలి

తమ హయాంలో ఇచ్చిన రైతుబంధు పక్కదారి పట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. 70 లక్షల మంది రైతులకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పలుమార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లెక్కలు బయటపెట్టాలన్నారు.

ప్రతి ఊరికి రైతుబంధు వెళ్లిందని, అవినీతి జరిగితే ఏ ఊరికి ఆ ఊరిలో లెక్కలు తీద్దామన్నారు. రైతు బంధు ఏ ఊర్లో ఎంత వృథా అయిందో... గ్రామపంచాయతీల వారిగా లెక్క తీయాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. రైతుబంధు డబ్బులు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుబంధుపై ఈ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలని సూచించారు. 

రైతు భరోసాకు ప్రభుత్వం ఇదివరకే దరఖాస్తులు తీసుకుందని, ఇప్పుడు మరోసారి దరఖాస్తులు అడగడం ఏమిటని ప్రశ్నించారు. మీ ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. రైతును రాజుగా చేయాలన్నది తమ ఆలోచన అయితే... బిచ్చగాడిగా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విమర్శించారు.

  • Loading...

More Telugu News