Free Journey For Women: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ఏపీ మంత్రులు
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి
- మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు
- అధ్యయనం నిమిత్తం కర్ణాటకలో పర్యటిస్తున్న ఏపీ మంత్రులు
- నేడు కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం
ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, అధ్యయనం నిమిత్తం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యాటిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని, కర్ణాటక అధికారులను కలిశారు. వారితో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించారు.
కర్ణాటకలో పర్యటన సందర్భంగా ఏపీ మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉచిత ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు.