DK Aruna: ఏపీని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు: డీకే అరుణ
- విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ
- కుటుంబ సమేతంగా వచ్చామని వెల్లడి
- రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరగాలని కోరుకున్నానన్న అరుణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశంసలు కురిపించారు. సీఎంగా చంద్రబాబు ఏపీని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. విజయవాడ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే (విజయవాడ పశ్చిమ) సుజనా చౌదరి మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డీకే అరుణ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలనుకున్నామని... అయితే, ఆ సమయంలో వరదలు రావడంతో ఇక్కడకు రావడం ఆలస్యమయిందని డీకే అరుణ చెప్పారు. అమ్మవారు విజయానికి ప్రతీక అని... తనకు కూడా మంచి విజయాన్ని అందించారని అన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చామని తెలిపారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... అందరికీ మంచి జరగాలని కోరుకున్నానని చెప్పారు. గతం కంటే అమ్మవారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.