China: చైనా కొత్త వైరస్‌పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన అవసరం లేదన్న డీజీహెచ్ఎస్
- డేటా ప్రకారం ఎలాంటి మార్పులు లేవన్న డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి
- శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నియంత్రణకు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
చైనాలో వెలుగు చూసిన కొత్త వైరస్‌పై భారత కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల సంస్థ (డీజీహెచ్ఎస్) స్పందించింది. చైనాలో కొత్త వైరస్ కారణంగా అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు వరుస కడుతున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఇది ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. చైనా కొత్త వైరస్‌పై డీజీహెచ్ఎస్ స్పందించింది. ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన అవసరం లేదని తెలిపింది.
చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఆందోళన కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, ఈ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఉంటుందని డాక్టర్ అతుల్ తెలిపారు. వృద్ధులు, పిల్లల్లో ఇది ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుందని తెలిపారు.
మన దేశంలోనూ శ్వాసకోశ సంబంధిత వైరస్ వ్యాప్తికి సంబందించిన డేటాను విశ్లేషించామన్నారు. డిసెంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం ఎలాంటి గణనీయమైన మార్పులు కనిపించలేదన్నారు. సాధారణంగా శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయన్నారు. ఇందుకోసం ఆసుపత్రులు ఇతర సామగ్రి, బెడ్స్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రజలు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నియంత్రణకు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు అందరిలో కలవకపోవడమే మంచిదన్నారు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఉండదన్నారు. మామూలుగా దగ్గు, తుమ్ము వస్తే కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలని సూచించారు. జలుబు, జ్వరం వంటివి ఉంటే మెడిసిన్ తీసుకోవాలన్నారు.