Australia vs India: సిడ్నీ టెస్టు... ముగిసిన రెండో రోజు ఆట... భారత్ ఆధిక్యం ఎంతంటే..!
- సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ ఐదో టెస్టు
- రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 141/6
- 145 పరుగుల ముందంజలో టీమిండియా
- తుపాను ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రిషభ్ పంత్
- 33 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 61 రన్స్ బాదిన పంత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో లభించిన 4 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ముందంజలో ఉంది.
భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ తుపాను ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 61 రన్స్ బాదాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 78 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను పంత్, జడేజా జోడీ 46 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేసింది.
తొలి వికెట్‌కు 42 పరుగుల మంచి ఓపెనింగ్ దక్కిన ఆ తర్వాత టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 22, కేఎల్ రాహుల్ 13, శుభ్‌మన్ గిల్ 13, విరాట్ కోహ్లీ 6, నితీశ్ కుమార్ రెడ్డి 4 రన్స్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (8 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్ (6 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు తీయగా... కమిన్స్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 9/1 తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో 172 రన్స్ జోడించి మిగతా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీ (57) తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతనికి తోడుగా స్టీవ్ స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23, అలెక్స్ కేరీ 21 రన్స్ తో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి తలో రెండు వికెట్లు తీశారు.