Pawan Kalyan: మూలాలు మర్చిపోకూడదు... చిరంజీవి గారి వల్లే నేను, రామ్ చరణ్ ఇక్కడున్నాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Game Changer pre release event
 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్టయినర్ మూవీ గేమ్ చేంజర్ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ఏపీలోని రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికరంగా ప్రసంగించారు. ఇవాళ పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఇంకెవరు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారే అని వ్యాఖ్యానించారు. 

"మమ్మల్ని గేమ్ చేంజర్లు అనొచ్చు, ఓజీ అనొచ్చు కానీ... ఆ మూలాలు ఒక మారుమూల పల్లెటూరు మొగల్తూరులో ఉన్నాయి. ఇవాళ మీరు కల్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి.... అన్నింటికీ ఆద్యుడు ఆయనే (చిరంజీవి). నేనెప్పుడూ మూలాలు మర్చిపోను. రఘుపతి వెంకయ్య గారిని, దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం. ఎన్టీ రామారావు గారిని మర్చిపోలేం. 

ఎంతోమందితో కూడిన తెలుగు చిత్రపరిశ్రమ కదిలి వచ్చిందంటే అందుకు స్ఫూర్తి అక్కినేని గారు, ఎన్టీఆర్ గారు, ఘట్టమనేని కృష్ణ గారు, శోభన్ బాబు గారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ కోసం సర్వశక్తులు ధారపోసిన మహానుభావులందరికీ ఒక నటుడిగానే కాదు, ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 

ఇవాళ ఇంత పెద్ద ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటున్నామంటే... కూటమి ప్రభుత్వ పెద్ద, ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు, ఆయన సహకారం, ఆయన నిరంతర మద్దతు వల్లే. ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. హోంమంత్రి అనిత గారికి, రాష్ట్ర డీజీపీకి, జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, ఇతర జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వేదికపై ఉన్న శ్రీ కందుల దుర్గేశ్ గారికి కూడా ధన్యవాదాలు" అంటూ పవన్ ప్రసంగించారు. 
Pawan Kalyan
Game Changer
Pre Release Event
Rajahmundry

More Telugu News