Revanth Reddy: అలా ఉంటే రైతు భరోసా ఇవ్వబోం: కేబినెట్ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Revanth Reddy announcment on Rythu Bharosa

  • మూడు గంటల పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం
  • వ్యవసాయ యోగ్యత కలిగిన భూములకు రైతు భరోసా ఇస్తామని వెల్లడి
  • వ్యవసాయ యోగ్యత లేని భూములకు ఇవ్వబోమని స్పష్టీకరణ
  • భూమి లేని రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామన్న సీఎం

రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కలిగిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు సచివాలయంలో సీఎం అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో మూడు గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్పష్టంగా చెబుతున్నామని, వ్యవసాయ యోగ్యత లేని భూములకు మాత్రం రైతు భరోసా వర్తించదన్నారు. వ్యవసాయ భూములకు మాత్రం ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. 

భూమి లేకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు ఇస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కలిగిన భూములన్నింటికి రైతు భరోసా కింద నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తామన్నారు. భూమిలేని రైతు కుటుంబాలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' కింద రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో పరిశ్రమలకు భూములు ఇచ్చి ధరణి లోపాల కారణంగా రైతుబంధు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని... కానీ వారే ముందుకు వచ్చి వివరాలు చెప్పాలన్నారు.

కొన్నేళ్లుగా రేషన్ కార్డు సమస్యగా మారిందన్నారు. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కేబినెట్ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై చర్చించిందని... వాటికి సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మూడు అంశాలను ప్రజలకు చేరవేయాలన్నారు. జనవరి 26 నుంచి అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కొత్త సంవత్సరంలో ఇదే మొదటి మీడియా సమావేశం

2025 కొత్త సంవత్సరంలో ఇదే మొదటి పత్రికా సమావేశమని రేవంత్ రెడ్డి తన మీడియా సమావేశం ఆరంభంలో అన్నారు. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రైతులకు కొత్త ఏడాదిలో మంచి జరగాలని కోరుకుంటున్నామని, వారిని ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయం దండగ కాదని... పండుగ చేయాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News