Bandi Sanjay: తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ విమర్శలు

union minister bandi sanjay hitout revant reddy government on rythu bharosha
  • రైతులకు ఎకరాకు రూ.12వేలే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గమన్న బండి సంజయ్
  • ప్రజలను దారుణంగా మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందన్న బండి సంజయ్ 
  • ఇందిరమ్మ అభయ హస్తం అంటే .. భస్మాసుర హస్తమని నిరూపించారన్న బండి సంజయ్
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందిరమ్మ భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రూ.12వేలే ఇస్తామని ప్రకటించడం దుర్మార్గమని, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ప్రజలను దారుణంగా మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలకు, నేడు సీఎం చేసిన ప్రకటనకు పొంతనే లేదని అన్నారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రకటన చేయడం అంటే రైతులను దగా చేయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిందని, ఈ ఏడాది పాటు రైతు భరోసా చెల్లించకుండా ఎగ్గొట్టారని అన్నారు. ఆలస్యమైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని గత ఏడాది చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లిస్తారని ఆశించిన రైతులకు పూర్తిగా నిరాశే మిగిలిందన్నారు. 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రైతు భరోసా బకాయి చెల్లించకపోగా, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన రైతు భరోసా హామీకి సైతం తూట్లు పొడిచి ఇందిరమ్మ అభయ హస్తం అంటే .. భస్మాసుర హస్తమని నిరూపించారని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను పరిశీలిస్తే .. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయలేదని తేటతెల్లమయిందన్నారు. ఎగ్గొట్టిన ఏడాది రైతు భరోసా బకాయి మొత్తాన్ని విభజించి ఏటా రెండేసి వేల రూపాయల చొప్పున రాబోయే నాలుగేళ్లకు జోడించి చెల్లించాలనుకుంటున్నారే తప్ప రైతులకు అదనంగా ఒరగబెట్టిందేమి లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎకరాలకు మరో రూ.2వేల రైతులు నష్టపోయినట్లు అయిందన్నారు. 

కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి .. వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించడం అన్యాయమన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రాష్ట్రంలో ఎంత మంది రైతులకు ఎంత మొత్తం చెల్లిస్తారు.. ? ఎంత మంది కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా సొమ్ము చెల్లిస్తారో ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రైతు బంధు లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోత విధించాలనుకుంటున్నాడని బండి ఆరోపించారు. 

ఇప్పటికే 46 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చెల్లిస్తామని 22 లక్షల మందికి పైగా రైతులకు ఎగగొట్టారని, అన్నిరకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి తర్వాత సన్న వడ్లకే బోనస్ పరిమితం చేశారని, అది కూడా కొంత మంది రైతులకే చెల్లించారని విమర్శించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే కోతలు విధించడమేనా ..?ఇందిరమ్మ పాలన అంటే ఇచ్చిన హామీ మాట తప్పడమేనా ? అని ప్రశ్నించారు. 

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఏడాది లోనైనా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెల నెలా రూ.2500, వృద్ధులు, వితంతువులకు 4వేల పెన్షన్, రూ.4వేల నిరుద్యోగ భృతి, ఇల్లు లేని పేదలకు భూమితో పాటు రూ.5 లక్షల ఆర్ధిక సాయం వంటి హామీలను అమలు చేయకుండా పేదల బతుకులను బజారున పడేశారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Bandi Sanjay
cm revanth reddy
Congress
Telangana
BJP

More Telugu News