Vijayawada: విజయవాడలో కలకలం... ఇద్దరు బాలికలు మిస్సింగ్
- ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదంటున్న తల్లిదండ్రులు
- స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికలు
- పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు... ఆరు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు
విజయవాడలో ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలికలు ఎంతకూ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను వెతికి తీసుకురావాలంటూ కన్నీటితో పోలీసులను ప్రాధేయపడుతున్నారు. దీంతో కనిపించకుండా పోయిన బాలికల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల సాయంతో బాలికలు ఎక్కడికి వెళ్లారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాలికలు ఇద్దరూ విజయవాడలోని స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారని పోలీసులు తెలిపారు. బాలికల మిస్సింగ్ సమాచారంతో తొలుత స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. దీంతో బాలికల ఇళ్లకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామన్నారు. అయినప్పటికీ బాలికలు ఎటువైపు వెళ్లారనే విషయం తెలియరాలేదని చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు ఉద్ధృతం చేసినట్లు పోలీసులు వివరించారు. సాధ్యమైనంత తొందరగా బాలికలను వెతికి పట్టుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నట్లు తెలిపారు. బాలికలను క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.