JC Prabhakar Reddy: మాధవీలతపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే: జేసీ ప్రభాకర్ రెడ్డి
- న్యూ ఇయర్ వేడుకల వేళ మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు
- తీవ్ర చర్చనీయాంశంగా జేసీ కామెంట్స్
- తాజాగా క్షమాపణలు చెప్పిన వైనం
ఇటీవల న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. జేసీ కాస్త తీవ్ర స్థాయిలో స్పందించి మాధవీలతను 'ప్రాస్టిట్యూట్' (వ్యభిచారి) అని సంబోధించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, నోరు జారానని అంగీకరించారు. మాధవీలతకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
తాడిపత్రిలో మహిళల కోసం న్యూ ఇయర్ రోజున జేసీ పార్క్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, జేసీ పార్క్ కు మహిళలు వెళ్లొద్దని, అక్కడి అరాచక శక్తుల వల్ల మహిళలకు అపాయం కలిగొచ్చని మాధవీలత వ్యాఖ్యానించారు. దాంతో జేసీ భగ్గుమన్నారు. మాధవీలతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారం కాస్తా జేసీ వర్సెస్ ఏపీ బీజేపీ నేతలు అన్నట్టుగా తయారైంది. జేసీ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ నేతలు బాహాటంగానే ఖండించారు.