Kakarla Venkata Rami Reddy: పింఛను పంపిణీలో మూడు గంటలు ఆలస్యమైతే కొంపలు మునిగిపోతాయా?: ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
- ఉద్యోగులను ఇబ్బందిపెట్టే వారి పేర్లు రాసిపెట్టుకోవాలన్న ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు
- టీడీపీ కార్యకర్తల పని చేసిపెట్టకుంటే సంగతి చూస్తామని మంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపణ
- రాష్ట్రంలో ఉద్యోగులకు అనుకూల పని వాతావరణం లేదని విమర్శ
ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫించన్లపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయాస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని నిద్రలేపి ఇవ్వాల్సిన అవసరం ఏముందని, మూడు గంటలు లేటైతే ప్రపంచం తల్లకిందులైపోతుందా? అని ప్రశ్నించారు. నిన్న ఉదయం తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టే వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, భవిష్యత్తులో వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సమీక్షల సందర్భంగా కిందిస్థాయి అధికారులను ఉన్నతాధికారులు తిడుతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు వస్తే వారికి టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పని చేసి పంపాలని, లేదంటే మీ సంగతి చూస్తామంటూ మంత్రుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగులను ఎక్కడా గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు అనుకూల పని వాతావరణం లేదని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తెల్లవారకముందే చీకట్లో పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారని, అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వేరే ఊర్లో ఉన్న ఉద్యోగి ఎన్ని గంటలకు లేచి వచ్చి పింఛన్లు పంపిణీ చేయాలని, ఆ సమయంలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 గంటలకు ఇవ్వాల్సిన పింఛన్ 8 గంటలకు ఇస్తే ఏమవుతుందని, ప్రపంచం తల్లకిందులైపోతుందా? అని నిలదీశారు. సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని, పెండింగ్ డీఏల్లో ఒక్కటైనా ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.